జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత :
6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥
శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
అక్కడ నుండి తాతగారితో కలిసి బృందమంతా ఋషికేశ్ బయలుదేరి గంగాతీరమును చేరిరి . మనోహరమైన ఆ ప్రకృతి శోభకు అందరూ పులకరించి గంగా తీర్థమును సేవింపగా ,గంగామాత మాత్రము ఇంతటి మహాయోగి దర్శన భాగ్యముచే పులకరించి పరవళ్లు తొక్కింది . అప్పుడు నారాయణ రెడ్డి గారికి గంగానది ఎప్పుడెప్పుడు మహనీయుల పాదస్పర్శచే తన కంటిన మాలిన్యమును తొలగించుకోవాలని ఎదురుచూస్తూంటుంది అని తెలిసిన వారగుటచే పవిత్ర గంగానది మధ్యకు తాతగారిని రమ్మని ప్రార్ధించగా "సరే పోదాం పద " అంటూ ముందుగా తెలియచేయనప్పటికీ ,నది దిగువ వైపు గుండా కొంత దూరము నడచి అక్కడ ఉన్న ఒక ఎత్తైన రాయిపైకి ఎక్కి అక్కడనే అయిదారు నిమిషములు కదలకుండా నిశ్చలముగా నిలుచుండిపోయిరి . నాలుగైదు అడుగులఎత్తున ఆ రాయి చివర అతి కష్టము మీద రెండు పాదములుంచుటయే గగనము . అంతటి సన్నని ఆ రాతిమీద తాత అంత సమయము నిలుచుండిపోయిరి . అది గమనిస్తున్న నారాయణరెడ్డి ,మదిలేటి తదితరులందరూ తీవ్ర ఆందోళనమునకు గురియైరి . ఎందుకనగా ఏ మాత్రము పట్టుతప్పినా అంత ఎత్తు నుండి క్రిందకు పడిపోవుట ఖాయము . మానవ సహజమైన ఆత్రుతతోనూ , తాతపై వారికున్న ప్రేమవల్లనూ వారారకముగా ఆందోళన చెందిరి కానీ ,సృష్టిని శాసించి ఆపగల సర్వాధికారియైన తాతకు ఆ రాయి ఒక లెక్కనా ? కొంతసేపు ఆ విధముగా తాత తన లీలావిలాసమును చూపి అటు పిమ్మట కిందకు దిగివచ్చి గంగా జలమునకు చేరువగా వచ్చుసరికి మదిలేటి ఆపుకోలేని ఉత్సాహముతో గంగోదకమును తెచ్చి తాత పాదములను భక్తితో కడిగాడు . ఆ నీరంతా తిరిగి గంగానదిని చేరింది . ఆ విధముగా నారాయణరెడ్డి గారికి తాత పాదస్పర్శచే గంగానదిని పునీతము చేయవలెనన్న సంకల్పము నెరవేరినది .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!